గోశాలలో గోవులు చనిపోలేదని ప్రకటన
అమరావతి – టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి అనిత వంగలపూడి. తిరుమల గోశాలలో గోవులు చని పోయాయంటూ కామెంట్స్ చేయడం పట్ల మండిపడ్డారు. టీటీడీ గో మరణాలపై వైసిపి నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీపై భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత. కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేయడం బాధాకరమన్నారు. గోసంరక్షణ శాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు . టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను కృషి చేస్తున్నారని తెలిపారు.గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతుంటే ఆవులకు జియోట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు.
గోశాలను గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపా టు ప్రతిరోజూ శుభ్ర పరచడం, బ్లీచింగ్ చేయడం జరుగుతుందన్నారు. గోశాలను సందర్శించిన భక్తులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇక్కడ పరిశుభ్రత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. టీటీడీని కూడా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చే చర్యలకు పాల్పడింది నువ్వు కాదా అంటూ భూమనపై రెచ్చి పోయారు.