Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHపోలీసులు గీత దాటితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

పోలీసులు గీత దాటితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు


రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత

అమరావతి – ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పోలీసులు నిష్పక్షపాతంగా సేవలందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత స్ప‌ష్టం చేశారు. ఏకపక్షంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా చర్యలకు వెనుకాడబోమని అన్నారు. పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

జైలులో ఖైదీలకు కనీస సదుపాయాలు కల్పిస్తామ‌న్నారు. సోమ‌వారం విజయవాడ గాంధీనగర్ లో ఉన్న జైలును ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. బోరుగడ్డ అనిల్ కేసులో జైలు అధికారులపై పలు ఆరోపణలు వ‌చ్చాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ అధికారులపై విచారణ జరుగుతోందన్నారు. మరో రెండు రోజుల్లో నివేదిక రాగానే ఆరోపణలు నిజమని తేలితే చట్ట ప్రకారం జైలు అధికారులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పాలనలో చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అన్నారు. తప్పులను కప్పి పుచ్చుకోవడానికి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ జ‌రుపుతున్నారంటూ ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతా రాహిత్యంగా కుసంస్కారంతో విమర్శిస్తున్న విజయసాయిరెడ్డిపై కేసులు పెడతామని హోంమంత్రి స్పష్టం చేశారు.

కాకినాడ సెజ్, పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని, వైవీ సుబ్బారెడ్డి అల్లుడిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని చీల్చేందుకు వైఎస్ఆర్సీపీ విఫలయత్నం చేస్తోందన్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజల సొమ్మును దోచుకున్న ఏ ఒక్కరినీ వదలమని హోంమంత్రి హెచ్చరించారు. పీకల మీద కత్తిపెట్టి ఆస్తులు రాయించు కోవడం, ప్రశ్నిస్తే కక్షగట్టి దాడులకు దిగిన ఘటనలు గత ప్రభుత్వంలో మాత్రమే జరిగాయన్నారు. కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments