జనం ఛీ కొట్టినా జగన్ కు బుద్ది మారలేదు
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి – ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. జనం ఛీ కొట్టినా ఇంకా బుద్ది మారడం లేదన్నారు. ఇకనైనా తను మారితే బెటర్ అని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు మంత్రి.
ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది మీరు కాదా జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్యా రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల మొదలుకొని ప్రతిపక్ష నేతల వరకు దాడులు, దౌర్జన్యలు జరగని రోజు ఏదైనా ఉందా అని నిలదీశారు అచ్చెన్నాయుడు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి చంపింది ఎవరు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్లుమూసుకొని కూర్చున్నారా అని నిలదీశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని అన్నారు మంత్రి. జగన్ మానసిక పరిస్థితే బాగా లేదన్నారు. అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థంకాక కూటమి ప్రభుత్వంపై అబద్ధాలతో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ ముఠా పాలన నడిపింది మీరు కాదా జగన్ రెడ్డి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఇప్పుడైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.