మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటన
అమరావతి – మోదీ పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దేశం గర్వం పడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మే 2 న ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. మచిలీపట్నం కలెక్టరేట్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ డీ కే బాలాజీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. మోదీ సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
రవాణా సదుపాయం, తాగు నీరు వసతి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సభ వేదికకు చేరుకోవడం వంటి సన్నాహాక ఏర్పాట్లపై సూచనలు చేశారు.
దేశ చరిత్రలో ఎవ్వరూ చేయని త్యాగం అమరావతి రైతులు చేసి, 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారని అన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని ప్రారంభిస్తే, రాక్షస పాలనతో జగన్ మోహన్ రెడ్డి మధ్యలో వదిలేశారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి, మూడు ముక్కలాటతో అమరావతి రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు ఎడతెగని పోరాటం చేసినా, నాటి ప్రభుత్వానికి రైతుల ఘోష వినపడ లేదన్నారు. అమరావతి రాజధాని పునర్ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములం అవుతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముందుకు వస్తున్నారని చెప్పారు మంత్రులు.