మహిళా సాధికారతే లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్ – మహిళా సాధికారతే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పలు రంగాలలో తమ స్వశక్తితో ముందుకు వచ్చిన వారికి, ఆదర్శ ప్రాయంగా ఉన్న వారికి తోడ్పాటు అందజేస్తున్నట్లు చెప్పారు.
ఇవాళ తాము ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా మహిళలు ఇవాళ తల ఎత్తుకుని నిలబడేలా చేయడం జరిగిందన్నారు దాసరి సీతక్క.
మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా శిల్పా రామంలో 100 స్టాల్స్ ను ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు దాసరి సీతక్క.