కోల్ కత్తా ఘటన బాధాకరం – సీతక్క
వైద్యుల ఆందోళనకు మంత్రి మద్దతు
హైదరాబాద్ – రాష్ట్ర గిరిజన సంక్షేమ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ కత్తాలో మహిళ వైద్యురాలి హత్యాచారంపై గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టిన డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
కోల్ కత్తా ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు సీతక్క. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలని అన్నారు. మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు సీతక్క.
కలకత్తాలో వైద్యురాలిపై హత్యాచారం జరగడం బాధాకరమని అన్నారు. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. తరగతి గదుల నుంచే బాలికలు, యువతులు, మహిళల పట్ల ఎలా మెలగాలనే దానిపై నేర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
తప్పు చేసిన వారిని ఉపేంక్షించే ప్రసక్తి లేదన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు పూర్తి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి సీతక్క.