NEWSANDHRA PRADESH

దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం

Share it with your family & friends

మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమరావతి : వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్ప‌ష్టం చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీడీపీ హయాంలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్ రెడ్డి వారి పొట్ట కొట్టారని అన్నారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఎస్సీ ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానం అమలు చేయలేదని విమర్శించారు. బి , సి కేటగిరి కింద మెడికల్ సీట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసుల్లో నిందితులకు 41 సీఆర్పీసీ కింద స్టేషన్ బెయిల్ మంజూరు చేశారని అన్నారు. ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.50,000/- అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా నిలిపేశారని వాపోయారు.

ఉద్యోగాల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టం సక్రమంగా అమలు కాలేదన్నారు. ఎస్సీలకు పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వలేదని మండిప‌డ్డారు. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉన్న అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశారని బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దళితులకు మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి కంసుడిలా మారి ద్రోహం చేశారని అన్నారు. అందుకే దళితులు తిరగబడి రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టారని చెప్పారు.