మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి – తన ఐదేళ్ల పాలనా కాలంలో జగన్ ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలకు నరకం చూపించాడని, తమ పార్టీకి చెందిన నేతలు, శ్రేణులను ముప్పుతిప్పలు పెట్టాడన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ సక్రమేనని స్పష్టం చేశారు. టీచర్లకు బార్ లు, బాత్రూంల వద్ద డ్యూటీలు నిర్వహించేలా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఏడు నెలల కాలంలో కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం తథ్యం అని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం, తణుకుల్లో పాల్గొన్నారు.
ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు అంశాలపై కూటమి నేతలకు మంత్రి అవగాహన కల్పించారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. అన్ని వ్యవస్థల్ని సర్వ నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని దుయ్యబట్టారు. గురువులను మానసిక క్షోభకు గురి చేశారని మంత్రి మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. చెప్పినవన్నీ చేస్తామని… చేయలేని పనులను ఎప్పుడూ కూటమి చెప్పదని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు.