జగన్ అవినీతి అనకొండ – గొట్టిపాటి
అక్రమాలపై విచారణ చేపడతాం
మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏం సాధించారని శాలువా కప్పాలని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు, విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేసినందుకు సన్మానం చేయాలా అని నిలదీశారు. తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు కప్పాలా? దేశంలోనే అవినీతి సామ్రాట్ అని బిరుదు ఇవ్వాలా అని మంత్రి మండిపడ్డారు.
శనివారం గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ వ్యవస్థలపై లక్ష కోట్లు అప్పు చేసి అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు, జగన్ నిర్వాకాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతి ఆనాడు రాష్ట్రం దాటితే.. ఇప్పుడు దేశం దాటిందంటూ ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం వచ్చాక సీన్ మారిందన్నారు. జగన్ అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏ సమస్యలు లేకుండా, సుఖ సంతోషాలతో జీవించినప్పుడే నిజమైన ప్రగతి అని సీఎం నమ్మారని చెప్పారు.
ఓ పక్క రాష్ట్రాన్ని సంక్షేమ, అభివృద్ధి పథంలో పయనింపజేస్తూనే.. మరో పక్క ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అన్ని నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ ప్రజా వేదికలు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు మంత్రి.