పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి – ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికారు మంత్రి కందుల దుర్గేష్. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి.అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామ తమ ప్రాంతమని, ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని స్పష్టం చేశారు.
తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి కూడా వర్తింప జేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో పర్యాటకాభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీ 2024-29 తీసుకు వచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.