కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి
అమరావతి : ఎవరికీ అన్యాయం జరగకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దామాషా పద్ధతిలో ఎవరెవరికి ఏ రకమైన ప్రయోజనాలు కల్పించాలన్న ఆలోచనకు రూపమే కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం అన్నారు. గడిచిన ఐదేళ్లలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో నియంతృత్వం, కక్షసాధింపు తప్ప మరే ఆలోచన చేయని గత ప్రభుత్వానికి , అందరికీ మంచి చేయాలన్న ఆలోచన, అందరినీ సమాన భాగస్వామ్యులను చేస్తూ ప్రజాస్వామిక విధానంలో పరిపాలన చేస్తున్న నేటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలన్నారు.
కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా కేబినెట్ సమావేశాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఎలా అమలు చేస్తుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతుందన్నారు. = ప్రజల ఆలోచనలకు దర్పణం పట్టే అవకాశం ఉందన్నారు. అంతేగాక ప్రజలకు అవసరమైన అంశాలను ప్రధానంగా చర్చించి రూపకల్పన చేసేందుకు కేబినెట్ సమావేశాలు దోహద పడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సహచరులతో చర్చించి ప్రజాస్వామిక విధానంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న విషయాన్ని మీడియా ద్వారా ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
గత ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాలకు నీళ్లొదిలేసి నాలుగు గోడల మధ్య నిర్ణయించుకున్న పరిస్థితులకు భిన్నంగా నేడు ప్రజల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చన్న విధానంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చూపిస్తున్న చొరవ రాష్ట్రానికి శుభసూచకమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.