రేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్
అమరావతి – పేదలకు మేలు చేసేలా పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. గురువారం మచిలీపట్నం రైతు బజార్ వద్ద బియ్యం, కంది పప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు మంత్రి.
పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందిస్తామన్నారు. రేషన్ షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేస్తామని, ప్రతి ఒక్క లబ్ధి దారుడు రేషన్ సరుకులు వినియోగించు కోవాలని సూచించారు.
రేషన్ మాఫియా లేకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటైన రేషన్ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం బియ్యం కందిపప్పు సహా 8 రకాల సరుకులు అందించిందని తెలిపారు. వైసిపి పాలనలో బియ్యం తప్ప మరో సరుకు అందించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో నేడు ప్రజా పాలన ప్రారంభమైందన్నారు. ఇక నుండి ప్రతి ఒక్కరికీ మేలు జరగబోతోందని చెప్పారు.