మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్
అమరావతి – మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నానిపై భగ్గుమన్నారు. రేషన్ బియ్యం స్కాం కేసుకు సంబంధించి కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తప్పు చేయక పోతే ఎందుకు నెల రోజులుగా తప్పించుకు తిరిగావో చెప్పాలన్నారు. చోరీ చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు..
కుట్రలు చేయాల్సిన అవసరం తమకు ఎందుకుంటుందన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమకు ఏమీ తెలియదన్నట్టు పేర్ని నాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారని, తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు.
గోడౌన్ ఎవరి పేరు మీద ఉంటే వారిపై కేసులు తప్పక చేయాల్సి వస్తుందన్నారు. ఐదేళ్లుగా వైసీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు పేర్ని నాని ఎందుకు స్పందించ లేదని మండిపడ్డారు.
భార్యను అడ్డం పెట్టుకుని పేర్ని నాని రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర. తప్పు చేస్తే ఆడ , మగ ఏంటి అని ప్రశ్నించారు. ఎవరైనా ఒక్కటేనన్నారు. తప్పు చేయక పోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు.