ఆర్థిక సాయం కోసం జీవో జారీ
అమరావతి – ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారిధి వెల్లడించారు. ఈ మేరకు జీవో జారీ చేశామన్నారు. ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు , పివిటీజీలకు రూ.1.00 లక్షల అదనపు ఆర్థిక సహాయం అంద జేయడం జరుగుతుందన్నారు. పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -1.0, పి.ఎం.జన్మన్ పథకాల క్రింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్దిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు.
దీనికి తోడు ఎస్.హెచ్.జీ. సభ్యులకు జీరో వడ్డీపై రూ.35 వేల వరకు ఋణ సౌకర్యాన్ని కల్పించడం కూడా జరుగుతుందన్నారు. ఇసుక కూడా ఉచితంగా అందచేస్తామన్నారు. ఇసుక రవాణాకై రూ.15 వేల ను రవాణా చార్జీల క్రింద ఇస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం అందజేసే యూనిట్ కాస్టు రూ.1.80 లక్షలకు అదనంగా ఈ అదనపు ఆర్థిక సహాయం అందుతుందన్నారు కొలుసు పార్థసారథి. స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047లో భాగంగా 2029 నాటికి “అందరికీ ఇళ్లు” అనే లక్ష్య సాధనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు అందరికీ పక్కా గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.