మంత్రి పరామర్శ కుటుంబానికి ఆసరా
సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం
ఏలూరు జిల్లా – ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి బాణా సంచా పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. సుధాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
పార్టీ తరపున లక్ష రూపాయలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెండు లక్షలు పరిహారం, మృతుడి భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు కొలుసు పార్థసారథి. ఏలూరు లోని తూర్పు వీధి మారుతీ నగర్ కు చెందిన దుర్గేసి సుధాకర్ కుటుంబ సభ్యులను మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధ కృష్ణయ్య (చంటి ),జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, స్థానిక నాయకులు ఏస్ యం ఆర్ పెద్దబాబు,బొద్దని శ్రీనివాస్ లతో కలిసి పరామర్శించారు.
బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు మంత్రి. మట్టి ఖర్చులు నిమిత్తం 15 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్ గ్రేషియా త్వరగా వారికి అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు. దుర్గేష్ సుధాకర్ కుటుంబ సభ్యులకు ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.