నీ బండారం బయట పెడతా – కోమటిరెడ్డి
మర్డర్ కేసులు ఉన్నది నిజం కాదా
హైదరాబాద్ – మాజీ మంత్రి గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్బంగా విద్యుత్ శాఖకు సంబంధించి చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.
దీనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. జగదీశ్ రెడ్డిపై పలు మర్డర్ కేసులలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనికి స్పీకర్ అనుమతి ఇవ్వాలని కోరారు.
జగదీశ్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ఘోరాలు, నేరాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కోర్టులలో, పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లు చూస్తే తెలుస్తందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.