మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ – అసెంబ్లీలో నిప్పులు చెరిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై భగ్గుమన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసింది మీరు కాదా అంటూ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి పదేళ్ల పాటు రాచరిక పాలన సాగించింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. మీకు ఒక్క మాట కూడా తమ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చారని, చివరకు మీరు చెప్పినవన్నీ చేయరని భావించే తమకు ప్రజలకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. ఇకనైనా బుద్దిగా ఉండాలని సూచించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రైతులను ఆగం చేసింది మీరు కాదా అని నిలదీశారు. ఇవాళ తాము వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పొలాలు కళకళ లాడుతున్నాయని చెప్పారు. సాగు చేయని వాళ్లకు కూడా డబ్బులు ఇచ్చిన ఘనమైన చరిత్ర మీదేనంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో పాలన సాగిస్తున్నామని, తాము చేపట్టిన కుల గణన సర్వే దేశానికి ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ గులాబీ నేతలకు హితవు పలికారు.