నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్
అమరావతి – మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సంస్కారంతో నమస్కారం పెట్టానని, దానిని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు.
శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కొండపల్లి శ్రీనివాస్. అక్కడ కూర్చొని ఉన్న ఇతర నాయకులు లేచి పలకరించారని, అది సంస్కారంతో పలకరించడం జరిగిందేగాని అక్కడ ఎలాంటి సన్సేషన్ చోటు చేసుకోలేదన్నారు. దీనిపై అసత్య ప్రచారం జరుగుతుండడం పట్ల తనకు బాధ కలిగిందన్నారు.
ఇందులో సత్యం కించిత్తు కూడా లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ ఆలోచనలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని చెప్పారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్ట్, విశాఖపట్నంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు రావడం జరిగిందన్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్ అండ్ బిల్డింగ్స్ విషయాల్లో చిత్తశుద్దితో పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని పేర్కొన్నారు కొండపల్లి శ్రీనివాస్.