NEWSANDHRA PRADESH

హ‌రికృష్ణ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

Share it with your family & friends

ఏపీ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ నివాళి

అమ‌రావ‌తి – మాజీ మంత్రి , దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు ఏపీ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ . గురువారం మంగ‌ళ‌గిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు, పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమ‌ని అన్నారు. తెలుగు వాడి కీర్తిని చాటి చెప్పడంలో చైతన్యరథ సారధియై నిలిచారని పేర్కొన్నారు.

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా హరికృష్ణ నిలిచి పోయారని ప్ర‌శంసించారు. భౌతికంగా హ‌రికృష్ణ‌ మనతో లేక పోయినా ఆయన జ్ఞాపకాలు మన మదిలో చెరగని ముద్ర వేశాయి అని” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, ఏవి రమణ, నరసింహ ప్రసాద్, మురళి, వెంకటప్ప, పర్చూరి కృష్ణ, వెంకటేశ్వరరావు, పారా రామకృష్ణ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.