రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి – : తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అమరజీవి జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. పొట్టి శ్రీరాముల వంటి నాయకుడు పది మంది ఉంటే ఏడాదిలోనే భారతదేశానికి స్వాతంత్ర్య తీసుకురావొచ్చిన అప్పట్లో మహాత్ముడు కొనియాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, తెలుగు ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించిన పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు అమరణదీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన ఆత్మ బలిదానంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిందన్నారు. పొట్టి శ్రీరాములు హరిజనోద్ధరణకు కూడా ఎంతో కృషి చేశారన్నారు. ఆనాడు దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలని పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు.
తెలుగుజాతి ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు జీవించే ఉంటారన్నారు. అమరజీవి పోరాటం, ప్రాణార్పణం గురించి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. పొట్టి శ్రీరాముల పట్టుదల, అంకుఠిత దీక్ష నేటి యువతకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.