పేర్ని నాని కామెంట్స్ నాదెండ్ల సీరియస్
తనపై మాకు రాజకీయ కక్ష ఎందుకుంటుంది
అమరావతి – మంత్రి నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి తను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఆయనపై తమకు రాజకీయ కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గోడౌన్ నుంచి బియ్యం తరలి పోయాయని, దీనికి సంబంధిచి తన భార్యపై కేసు నమోదు చేశామన్నారు.
ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. బియ్యం పక్కదారి పట్టాయన్న సంగతి తమ పరిశీలనలో తేలిందన్నారు. అప్పటికప్పుడు విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. బియ్యం పక్కదారి పట్టకపోతే పేర్ని నాని ఎందుకు డబ్బులు చెల్లించారంటూ ప్రశ్నించారు. ఈ విషయం ప్రజలకు చెప్పాలని అన్నారు.
కుట్రలు చేయాల్సిన అవసరం తమకు ఎందుకుంటుందన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమకు ఏమీ తెలియదన్నట్టు పేర్ని నాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారని, తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు.
గోడౌన్ ఎవరి పేరు మీద ఉంటే వారిపై కేసులు తప్పక చేయాల్సి వస్తుందన్నారు. ఐదేళ్లుగా వైసీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు పేర్ని నాని ఎందుకు స్పందించ లేదని మండిపడ్డారు.