నిప్పులు చెరిగిన మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి – వైసీపీ నేతలు ఖూనీలు చేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్పా ఏనాడూ ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే ఇవాళ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. జగ్గంపేటలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దుర్మార్గంగా పాలించారని ఆవేదన చెందారు.
జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ ను ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనందరం చూశామన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన చేయలేదని మంత్రి మనోహర్ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో మనం చూశామన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా పల్లెల్లో పండగ వాతావరణం చూశామా అని ప్రశ్నించారు. ఈ ఎనిమిది నెలల కాలంలో గ్రామాల్లో 3300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారని తెలిపారు. ఒకే రోజు 13371 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి. ప్రజల పక్షాన బలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఒక వైపు విచారణ కొనసాగుతుంటే..మరో వైపు ఆ హత్యకు సంబంధించిన సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.