సమస్యలు విన్నవించిన ప్రజలు
విశాఖపట్నం – మంత్రి నారా లోకేష్ విశాఖలో సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపట్టారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్( డీఎస్సీ నోటిఫికేషన్) పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింప జేస్తామని 2013లో యూనియన్ తో జరిగిన అగ్రిమెంట అమలు చేయక పోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ ను అమలుచేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జెడ్ పీహెచ్ స్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని, సదరు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని విశాఖకు చెందిన రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు.
అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ డీటీగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ ఏఎస్ఆర్ జిల్లా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో పనిచేస్తూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న టి.అప్పారావు, ఈశ్వర్ రావులను తొలగించి అర్హులను నియమించాలని పాడేరుకు చెందిన ఎన్.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాము విశాఖ పెందుర్తిలోని సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్ లో 150 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామని, అయితే సదరు స్థలాన్ని అబిత్ రాజు అనే వ్యక్తి దౌర్జన్యం చేసి ఆక్రమించారని ఆర్.లక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు.