స్పష్టం చేసిన నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూనివర్శిటీల వీసీలను రాజీనామా చేయాలంటూ బెదిరించానని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైకాపా ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని లోకేష్ స్పీకర్ అయ్యన్నపాత్రుడును కోరారు.
వీసీల రాజీనామా లేఖల్లో బెదిరింపు అన్న పదం లేనే లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదంటూ ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ..రాజారెడ్డి చెల్లెలి కోడలు అని, మరో వీసీ ప్రసాదొడ్డి.. వైకాపా కార్యకర్త అని ఆరోపించారు.
మంగళవారం జరిగిన అసెంబ్లీలో చర్చ సందర్బంగా లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆరోపించారు.
అందుకే ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని , ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు నారా లోకేష్. రాష్ట్రాన్ని అధికారం అడ్డం పెట్టుకుని సర్వ నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జనం అన్నీ గమనిస్తున్నారని ఆయనను ఎవరూ నమ్మరని పేర్కొన్నారు.