NEWSANDHRA PRADESH

టీడీఆర్ బాండ్ల‌లో భారీగా అక్ర‌మాలు

Share it with your family & friends

మంత్రి పుంగూరు నారాయ‌ణ ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి – రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి పుంగూరు నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం అసెంబ్లీలో టీడీఆర్ బాండ్ల‌కు సంబంధించి స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో 2019 నుంచి 2024 వ‌ర‌కూ 3 వేల 301 టీడీఆర్ బాండ్లు జారీ చేశార‌ని తెలిపారు. త‌ణుకు, విశాఖ‌, గుంటూరు ,తిరుప‌తిలో టీడీఆర్ బాండ్ల జారీలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు మంత్రి.

టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో జ‌రిగిన అక్ర‌మాల‌పై శాఖా ప‌ర‌మైన విచార‌ణ తో పాటు ఏసీబీ విచార‌ణ కూడా జ‌రుగుతుందని స్ప‌ష్టం చేశారు పుంగూరు నారాయ‌ణ‌.

ఇంకా నివేదిక రాలేద‌ని వ‌చ్చాక వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌ణుకులో 63 కోట్ల 24 ల‌క్ష‌ల విలువ‌తో బాండ్లు ఇవ్వాల్సి ఉండ‌గా…734 కోట్ల 67 ల‌క్ష‌ల‌కు బాండ్లు జారీ చేశార‌ని చెప్పారు. ఒక్క త‌ణుకులోనే 691 కోట్ల 43 ల‌క్ష‌లు స్కాం జ‌రిగిన‌ట్లు అధికారులు నివేదిక ఇచ్చార‌ని తెలిపారు.

తిరుప‌తిలో జ‌రిగిన భారీ స్కాంపై నాలుగు సార్లు విచార‌ణ వేసినా క‌మిష‌న‌ర్ స‌రిగా స్పందించ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. మ‌రోసారి తిరుప‌తిలో టీడీఆర్ బాండ్ల అక్ర‌మాల‌పై విచార‌ణ క‌మిటీ వేస్తామ‌ని ప్ర‌క‌టించారు పుంగూరు నారాయ‌ణ‌.

త‌ణుకులో ఇప్ప‌టికే ముగ్గురు అధికారుల‌ను సస్పెండ్ చేశామ‌న్నారు. రాబోయే 15 రోజుల్లో బాండ్ల జారీని పూర్తిగా నిలిపి వేశామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన అక్ర‌మాల‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేస్తామ‌న్నారు.
ఎలాంటి విచార‌ణ జ‌ర‌పాల‌నేది సీఎంతో మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి.

అధికారుల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రున్నా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఎక్క‌డా రాజీ ప‌డేది లేదు…రాబోయే రోజుల్లో ప‌గ‌డ్బందీగా ముందుకు వెళ‌తామ‌న్నారు.