అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మంత్రి నారాయణ
అమరావతి – మంత్రి నారాయణ సంచలన ప్రకటన చేశారు. విశాఖలో చోటు చేసుకున్న టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ , సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని చెప్పారు. నివేదిక ఇంకా రాలేదని, వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాసన సభ ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకవతకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఒక్క విశాఖలోనే కాదు తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయన్నారు. శుక్రవారం మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తణుకులో 63.24 కోట్ల విలువ ఉన్న చోట 754 కోట్లకు బాండ్లు జారీ చేశారన్నారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారని తెలిపారు మంత్రి. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని వెల్లడించారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో మేం వచ్చిన తర్వాత ఐదు నెలలు బాండ్లు జారీ నిలిపి వేయడం జరిగిందని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్ లు, విశాఖలో 266 టీడీఆర్ లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని తెలిపారు.