గత ప్రభుత్వం అక్రమ కేసు బనాయింపు
విజయవాడ – రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ విజయవాడలోని స్పెషల్ కోర్టుకు కేసు నిమిత్తం హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై కేసు నమోదు చేశారు. మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. తమ న్యాయ పరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు నిమ్మల. ఈ సందర్బంగా ఆయనపై అక్రమ కేసు నమోదైంది పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో.
కోర్టు కేసు విచారణ నిమిత్తం హాజరైన అనంతరం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం అక్రమంగా కేసు బనాయించారని మండిపడ్డారు. అందుకే ప్రజలు తగిన రీతిలో జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి బుద్ది చెప్పారంటూ ఎద్దేవా చేశారు.
తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారని, అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిమ్మల రామా నాయుడు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా మంది బతికి బయట పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.