నిప్పులు చెరిగిన మంత్రి రామానాయుడు
అమరావతి – తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి నిమ్మల రామానాయుడు. కావాలని రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వృథాగా పోతున్న నీళ్లను వాడుకున్నామని, దీనిలో తప్పేముందంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ ఉనికి కోసమే రాద్ధాంతాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
తాము బరాబర్ నీళ్లను వాడుకుని తీరుతామంటూ స్పష్టం చేశారు. గోదావరి పై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం కట్టేందుకు ప్రయత్నం చేస్తే ఆనాడు తమ సీఎం చంద్రబాబు అడ్డుకున్నది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
గురువారం నిమ్మల రామా నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024 సంవత్సరంలో కృష్ణా నదికి చివరన ప్రకాశం బ్యారేజీ నుండి 871 టీఎంసీ ల నీరు సముద్రంలోకి పోయిందని స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే ఈ వృధానీరు, వెనుకబడిన కరువు జిల్లాలు, రాయల సీమకు, ఫ్లోరైడ్ భాదిత ప్రకాశం జిల్లాకు వాడుకుంటే అభ్యంతరం పెట్టడం దారుణమన్నారు.
ఏటా గోదావరి నుండి 3 వేల టీఎంసీ ల వరద నీరు సముద్రంలోకి వృథాగా పోతుందన్నారు. దానిలో 200 టీఎంసీల నీరు దుర్భిక్ష ప్రాంతాలకు తరలిస్తే ఏ పార్టీ అయినా , ఏ ప్రాంతం అయినా స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని నిలదీశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం, సానుకూల వాతావరణంలో ఆలోచించాలని పిలుపునిచ్చారు.