మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి – మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం సమీక్ష చేపట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని అన్నారు. 2026 జూన్ కల్లా వెలిగొండ రిజర్వాయర్ ను నింపి, ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పని చేస్తామన్నారు. జగన్ వెలిగొండను పూర్తి చేసినట్లుగా, జాతికి అంకితం అంటూ, మోసం, దగాతో జనాల్ని భ్రమింప చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రపంచంలో ఎనిమిదో వింత. చేయని పనులు కూడా చేశామని చెప్పుకోవడంలో తనకు తానే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
30 ఏళ్ళ క్రితం తాను ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు, ఇంకా పూర్తవ్వక పోవడం పై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. నిర్వాసితులకు 880 కోట్లు పరిహారం అందించాల్సి ఉండగా, జగన్ ఒక్క రూపాయి పరిహారం అందించ లేదంటూ ధ్వజమెత్తారు నిమ్మల రామానాయుడు. వెలిగొండ పూర్తి కావాలంటే ఇంకా 4 వేల కోట్లు కావాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆగి పోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను పునరుద్దరించామన్నారు. టన్నెల్ లో ఉన్న టిబిఎం మెషిన్ తొలగించడానికి కోర్టు కేసు ఉన్న నేపధ్యంలో, బైపాస్ టన్నెల్ నిర్మాణం, సాధ్యా సాధ్యాలపై చర్చిస్తున్నామని తెలిపారు మంత్రి.
హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్ఈ, ఈఈలు, డిఈఈలు, ఎజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.