మాట ఇచ్చినం అమలు చేస్తున్నాం
మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్
అమరావతి – తాము ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ చేస్తున్న అబద్దాలను నమ్మ వద్దని కోరారు. తాము కొలువు తీరి నెల రోజులు పూర్తయిందని, ఇప్పటి వరకు 30 కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు.
నిమ్మల రామా నాయుడు మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కార్యక్రమానికి వైసీపీ పదే పదే ఫేక్ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇలా చేయడం వల్లనే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని, ఇకనైనా బుద్ది తెచ్చుకోక పోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు నిమ్మల రామా నాయుడు.
పనిగట్టుకుని ప్రజలను గందరగోళ పరిచేలా తప్పుడు రాతలు రాస్తున్న జగన్ మోహన్ రెడ్డికి చెందిన పత్రిక, ఛానల్ పై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా తమ తీరు మార్చు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
విదివిధానాలు రూపొందించక ముందే తల్లికి వందనం మంగళం అంటూ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు నిమ్మల రామా నాయుడు. మాట ఇచ్చినట్లే పెంచిన పింఛన్ వెయ్యి రూపాయలను ఐదు రోజుల్లోనే ఇంటికి తెచ్చి అందించిన ఘనత చంద్రబాబుదన్నారు. అమ్మఒడి పేరుతో తల్లులను మోసం చేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు.