మంత్రి నిమ్మల రామా నాయుడు కామెంట్స్
అమరావతి – వ్యవసాయ రంగంలో ఒంగోలు జాతి ఎడ్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసలు కురిపించారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన 8 వ ఒంగోలు జాతి జాతీయ స్థాయి , ఎడ్ల బల, పశుపాల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్న ఆలపాటి రాజా అభినందనీయుడన్నారు. ఒంగోలు జాతి ఎడ్లు అంటే దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఆదర్శమన్నారు.
వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులు తగ్గి , యాంత్రీకరణ పెరుగుతున్నా, దున్నడం , ఉత్పత్తి రవాణా వంటి పలు వ్యవసాయ పనుల్లో ఒంగోలు జాతి ఎడ్లకు ఇప్పటికీ తిరుగు లేదన్నారు.పేదరికాన్ని పాలద్రోలడం లో పాడిపంటలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసలు కురిపించారు.
పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు పి-4 పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. గత 5 ఏళ్లలో పాలనలో జగన్ వ్యవసాయ శాఖ ను భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. నాడు తిత్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు రైతులకు హెక్టారుకు 20 వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే, వైసీపీ రివర్స్ పాలనలో 16 వేలకు తగ్గించారని మండిపడ్డారు.
రైతాంగానికి ఆక్సిజన్ లాంటి ఇన్స్యూరెన్స్ చెల్లించకుండా జగన్ మర్చిపోతే, చంద్రబాబు అసెంబ్లీ లో ధర్నా చేసి , అర్ధరాత్రి ఇన్స్యూరెన్స్ కట్టించారని అన్నారు. 2014-19 టీడీపీ పాలనలో రైతులకు వ్యవసాయ యంత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. గత సంవత్సరం పులిచింతలలో అర టీఎంసీ మాత్రమే ఉంటే , ప్రస్తుతం 34 టీఎంసీలు నిల్వ చేసి వచ్చే సీజన్ కు కూడా సాగు నీటిని నిల్వ చేశామన్నారు.