100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం
ఏపీ మంత్రి పార్థసారథి వెల్లడి
అమరావతి – గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు ఏపీ మంత్రి పార్థసారథి. ఏడాది కాలంలో 8.25 లక్షలను నిర్మిస్తామని వెల్లడించారు. ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి పార్థసారథి మాట్లాడారు.
రాబోయే 100 రోజుల్లో రాష్ట్రంలో 1.25 లక్షల గృహాలను నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నామని, దానిని పూర్తి చేస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు మంత్రి. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చేయని వారికి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇక వికసిత్ భారత్ కోసం ఏపీ సీఎం రోడ్ మ్యాప్ సిద్దం చేశారని తెలిపారు. పేదరికం లేని మార్గం కోసం పీ4 మోడల్ ను ప్రతిపాదించారని చెప్పారు పార్థసారథి. 2047 నాటికి భారత దేశం 30 ట్రిలియన్ల జీడిపీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.