రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపు
అమరావతి – మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. జగన్ హయాంలో విశాఖ రుషికొండ ప్యాలెస్ ను భారీ ఖర్చుతో నిర్మించారు. దీనిపై విచారణకు ఆదేశించింది కూటమి సర్కార్. ఈ తరుణంలో కాంట్రాక్టర్ కు ఆర్థిక శాఖ బిల్లులు క్లియరెన్స్ చేసిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలా బిల్లులు చెల్లించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు చెల్లించ లేదని, అదే సంస్థ వేరే పనులు చేపట్టిన పనులకు సంబంధించి మంజూరు చేశామన్నారు.
దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఓసారి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ ఫైర్ అయ్యారు.
అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అంటూ అధికారులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.
ఇకపై ఆ కాంట్రాక్టరు చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకు రాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ హెచ్చరించారు.