రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు పెంచబోదన్నారు. మార్చి 31 వరకు మాత్రమే కట్టేందుకు పర్మిషన్ ఇస్తామని, ఆ తర్వాత ఉండదన్నారు. ఆలోగా చెల్లించిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఇప్పుడు కాకుండా ఇళ్ళు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు 100 శాతం కట్టాల్సి ఉంటుందన్నారు. త్వరలో భూమి వాల్యూ పెంచబోతున్నట్లు ప్రకటించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
అంతే కాకుండా భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ను నియమిస్తామని చెప్పారు. అలాగే లైసెన్డ్ సర్వేయర్ లకు అవకాశం ఇస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది లైసెన్డ్ సర్వేయర్ లకు ఛాన్స్ ఇస్తామని వీరికి ట్రయినింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేంద్రం ప్రధాని అవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్ష 13 వేల ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్ల కు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే ఇస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. తనకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఏ ఎమ్మెల్యేతో కూడా సమస్య లేదన్నారు.