5 లక్షల మందికి పైగా జనం హాజరు
అమరావతి – దేశ ప్రధాని మోదీ మే 2వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక, జనం వచ్చే ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే రూట్స్ ను చూశారు. ప్రధాని మధ్యాహ్నం 3.25 గంటలకు వస్తారని చెప్పారు. టూర్ కు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రేపటి కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. సభకు 5 లక్షల మందికి పైగా ప్రజలు వస్తారని వెల్లడించారు.
రాజధాని అమరావతి కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారన్నారు మంత్రి నారాయణ. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. 365 కిమీ ట్రంక్ రోడ్లు, లే ఔట్ రోడ్లు 1500 కి,మీ మేర నిర్మించేలా ప్లాన్ ఉందన్నారు మంత్రి. గతంలోనే 41 వేల కోట్లకు పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. 2019 కు ముందు 5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించామన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని ఆరోపించారు నారాయణ. మళ్ళీ తమ ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించామని అన్నారు.