పోర్టులు..ఎయిర్ పోర్టులతోనే అభివృద్ది
ఏపీ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – ఏపీ పురపాలిక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది చెందాలంటే దేశమైనా, లేదా రాష్ట్రమైనా లేదా జిల్లా అయినా ముందుగా అక్కడికి పెద్ద ఎత్తున పోర్టులు, ఎయిర్ పోర్టులు రావాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే అభివృద్ది అన్నది జరగదన్నారు.
ఆదివారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కూడా హాజరయ్యారు.
వీలైనంత త్వరలో నెల్లూరు దగదర్తిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు పొంగూరు నారాయణ ,దీని కోసం ఢిల్లీలో వెళ్ళినప్పుడు చర్చించానని చెప్పారు. ఫలితంగా పరిశీలనలకు కమిటీ కూడా వేశారని వెల్లడించారు.
నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపై ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు డాక్టర్ పొంగూరు నారాయణ. చింతారెడ్డిపాలెం, కనుపర్తిపాడు కూడళ్ల వద్ద ఫ్లైఓవర్ వంతెల నిర్మాణానికి ఇప్పటికే ఎన్‌హెచ్ అధికారులతో చర్చించడం జరిగిందన్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.