టిడ్కో ఇళ్లను నాశనం చేసిన జగన్
నిప్పులు చెరిగిన పొంగూరు నారాయణ
అమరావతి – తమ హయాంలో తీసుకు వచ్చిన టిడ్కో ఇళ్లను నిర్మించకుండా గత ప్రభుత్వం కావాలని నాశనం చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సోమవారం ఆయన రాజధానిలో టిడ్కో గృహ సముదాయాలను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, టిడ్కో ఎండీతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వీటిలో 4 లక్షల 54 వేల 704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. 2019 నాటికి 77 వేల 371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయింది.
3 లక్షల 13 వేల 842 ఇళ్లును వైసీపీ ప్రభుత్వం 2 లక్షల 62 వేల 216 కు తగ్గించిందని ఆరోపించారు పొంగూరు నారాయణ. వీటిలో జగన్ సర్కార్ కేవలం 90 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాటిని పూర్తిగా నాశనం చేసిందంటూ ధ్వజమెత్తారు.
వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌళిక వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు పొంగూరు నారాయణ. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వాడేశారంటూ ఆరోపించారు. ఇక రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించారు.