NEWSANDHRA PRADESH

నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న

Share it with your family & friends

విజ‌య‌వాడ బైపాస్ ప‌నుల ప‌రిశీల‌న

అమరావ‌తి – ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మంత్రి నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. నాలుగు గంట‌ల పాటు ఆయ‌న ప‌లు గ్రామాల‌లో తిరిగారు. 16 వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే E 11,E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు.

వెంకట పాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని సూచించారు. రాజధాని కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చార‌ని చెప్పారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.

గత ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చామ‌న్నారు. ఇప్పటికే 22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపిందని వెల్ల‌డించారు మంత్రి.

మరో 20 వేల కోట్లకు సోమవారం జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు, నార్త్ నుంచి సౌత్ కి18 రోడ్లు వస్తున్నాయని తెలిపారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నామ‌ని చెప్పారు.

సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు పొంగూరు నారాయ‌ణ‌.

ఈ రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. ఎక్కువ ఇళ్లు డ్యామేజ్ కాకుండా రోడ్లను డిజైన్లు చేస్తున్నామ‌ని తెలిపారు. రెండు రోడ్లపై గంటకు 80 నుంచి100 కిమీ వేగంతో వెళ్ళేలా డిజైన్ చేశారర‌ని అన్నారు.

రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కొల్పోతున్న వారు సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇళ్లు కోల్పోతున్న వారితో మాట్లాడతారని స్ప‌ష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా రోడ్ల నిర్మాణాలు చేస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *