ఒత్తిళ్లను సహించం కూల్చివేతలు ఆపం
హెచ్చరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – రాష్ట్రంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు.
కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని , కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిదని సూచించారు. ప్రభుత్వానికి ఎవరిపైన కక్ష సాధింపు ధోరణి అంటూ ఉండదన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
గత 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ అడ్డగోలుగా ప్రభుత్వానికి చెందిన బూములను, చెరువులను ఆక్రమించుకునేలా మద్దతుగా నిలిచిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి. దీంతో ప్రజా ప్రభుత్వం కొలువు తీరాక ప్రజలకు సంబంధించిన ఆస్తులను, స్థలాలను, భూములను రక్షించడమే పనిగా పెట్టుకుందన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిషనర్ కు ఫుల్ పవర్స్ ఇచ్చామని చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఎక్కడా , ఎవరికీ తల వంచే ప్రసక్తి లేదన్నారు. అక్రమ కట్టడాలు, నిర్మాణాలను బాజాప్తాగా కూల్చి వేస్తామని స్పష్టం చేశారు.