లడ్డూ కల్తీపై విచారణ జరిపించాలి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్
ఢిల్లీ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం. జంతువుల, చేప నూనెను , నెయ్యిని లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో వాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదంపై తీవ్రంగా స్పందించారు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ చాలా తీవ్రమైనవని పేర్కొన్నారు.
ఈ మొత్తం లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సర్కార్ సమగ్ర విచారణ జరిపించాలని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉంది.