త్వరలో ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు
మంత్రి రాం ప్రసాద్ రెడ్డి వెల్లడి
ఏపీఎస్ఆర్టీసీకి తీపి కబురు చెప్పారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. త్వరలోనే ఆర్టీసికి 1400 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అంతే కాకుండా రవాణా పరంగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకు రావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఉచిత బస్సు సర్వీస్ స్కీం కోసం ప్రభుత్వం నూతన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మంత్రి.
ఆదివారం అధికారిక పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆర్టీసీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ కూటమి ప్రభుత్వం ఆర్టీసీని మరింత అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
బస్సులను ప్రారంభించిన అనంతరం రాం ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు నూతన సిబ్బంది, ఉద్యోగులను నియమిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం కేవలం ఆర్టీసీని ప్రచారం కోసం వాడుకుందన్నారు. దానిని నిర్వీర్యం చేసేందుకు యత్నించిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆర్టీసీని లాభాల బాటలో నడిచేలా కృషి చేస్తామన్నారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.