బాధిత మహిళలకు అండగా ఉంటాం
అమరావతి – రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప రవాణా శాఖలో కీచక అధికారి వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. బాధిత మహిళలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రవాణా శాఖకు మంచి పేరు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేయాలని ఉద్యోగులకు హితవు పలికారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు స్పూర్తి దాయకంగా ఉండేలా విధులు నిర్వహించాలని, ఇలా తల దించుకునేలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిసారి తాము తనిఖీలు చేయలేమని, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని స్పష్టం చేశారు.
ఎవరైనా తలతిక్క వేషాలు వేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సదరు అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికీ సరెండర్ చేశామన్నారు. సీనియర్ అధికారిని నియమించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై శాఖ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.