రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందివ్వనున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఆచార్య యాప్ రూపొందించామని, ఈ యాప్ ద్వారా 24 గంటల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తన ఛాంబర్ లో ఆన్ లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్ ను ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఈ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై మొదట సంతకం చేశారన్నారు.
డీఎస్సీ ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు బీసీ అభ్యర్థులే సాధించాలన్నది లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించామన్నారు. 26 జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు నిర్వహించామన్నారు. ఈ కేంద్రాల ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు. ఈ శిక్షణా కాలంలో నెలకు రూ.1500ల స్టయిఫండ్ తో పాటు మరో రూ.1000ల పుస్తకాల కొనుగోలుకు అందజేశామన్నారు.
ఆఫ్ లైన్ లో కోచింగ్ కు పొందలేని గృహిణులు, సుదూర ప్రాంతవాసులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారితో ఆర్థికంగా ఉన్న వెనుకబడిన వారికి లబ్ధి కలిగే ఆన్ లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. దరఖాస్తు చేసుకున్న బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు. ప్రస్తుతం 3,189 మంది దరఖాస్తులు వచ్చాయన్నారు.