ప్రభుత్వం నిర్ణయించిందన్న సవిత
అమరావతి : మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు 365 రోజులు భృతి కల్పించే లక్ష్యంలో భాగంగా ఆ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆటోనగర్ కు ఆనుకుని ఉన్న 10.80 ఎకరాలను చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి సవిత పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో చేనేత కార్మికులు తీవ్రంగా నష్ట పోయారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందక పోవడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ సదుపాయం లభించక పోవడంతో, ఎందరో నేతన్నలు అప్పుల పాలయ్యారన్నారు.
కొందరు చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విచారం వ్యక్తంచేశారు. టీడీపీ పాలనలో చేనేతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయం చేనేతకు స్వర్ణ యుగమన్నారు. 2014-19లో చేనేతల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.
నూలు కొనుగోలుకు రాయితీ అందజేశారని, ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించారని మంత్రి గుర్తు చేశారు. ముద్ర రుణాలతో పాటు త్రిఫ్ట్ పథకం అమలు చేశారన్నారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.