పిలుపునిచ్చిన మంత్రి ఎస్. సవిత
విజయవాడ : బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. కార్పొరేట్ కు ధీటుగా సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రలో బోధనా సదుపాయలు కల్పించామన్నారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వంట గదిని పరిశీలించారు. అనంతరం అభ్యర్థుల విశ్రాంతి గదులను, బాత్ రూమ్ లను, పరిశీలించారు. అదే సమయంలో సీ సెట్ పరీక్ష జరుగుతున్న తరగతిని కూడా పరిశీలించారు. ఎంతమంది విద్యార్థుల పరీక్షకు హాజరయ్యారని కో ఆర్డినేటర్ సాగర్ ను అడిగి తెలుసుకున్నారు. పక్క గదిలో ఉన్న డిజిటల్ లైబ్రరీని సందర్శించి, అక్కడున్న పలువురు అభ్యర్థులతో మంత్రి సవిత మాట్లాడారు.
స్టడీ మెటీరియల్ సరఫరా, అధ్యాపకుల బోధన, క్లాస్ ల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపైనా ఆరా తీశారు. బోధనతో పాటు కార్పొరేట్ శిక్షణా కేంద్రాలకు ధీటుగా డిజిటిల్ లైబ్రరీ, ఇతర సౌకర్యాలు కల్పించారని అభ్యర్థులు ఆనందం వ్యక్తంచేశారు. వంట గది, విశ్రాంతి గదులు అపరిశుభ్రంగా ఉండడంపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి భోజనం కోసం టామాటా, ఇతర కూరగాయాలు ఉదయమే కోసి సిద్ధం చేయడమే కాకుండా వాటిపై ఈగలు వాలుతుండం పైనా, ఆ పక్కనే వాడుక నీరు ఉండడంపైనా మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
పక్వానికి రాని అరటి పండ్లను అభ్యర్థులకు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇటువంటి అరటిపండ్లు మీరు తింటారా…మీ పిల్లలతోనైనా తినిపిస్తారా..? అని నిలదీశారు. అన్ని గదులనూ శుభ్రం చేయక పోవడంపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారని..? నిలదీశారు. ఎప్పటికప్పుడు గదులు, బాత్ రూమ్ లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వం రూపొదించిన చార్ట్ ప్రకారం మెనూ అమలు చేయాలని, రుచికరమైన, ఎప్పటికప్పుడు తయారు చేసిన ఆహారం అందించాలని స్పష్టం చేశారు. ఎంతో ఉన్నత ఆశయంతో సీఎం చంద్రబాబు నాయుడు బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేస్తున్నారని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు.
అనంతరం సివిల్ సర్వీసెస్ కోచింగ్ అభ్యర్థులతో కలిసి మంత్రి సవిత మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభ్యర్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీసీ యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. దీనిలో భాగంగా సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కార్పొరేట్ కు ధీటుగా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు.