మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటన
అమరావతి – ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వైద్య సేవల్లో లోపాలను తొలగించాలని పిలుపునిచ్చారు మంత్రి సత్య కుమార్ యాదవ్. సేవల నాణ్యతను మరింత మెరుగు పర్చేందుకు వైద్య సిబ్బంది పునరంకితం కావాలని అన్నారు. ఆరోగ్య, సౌభాగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు ప్రజారోగ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్బంగా బహిరంగ లేఖ రాశారు.
వైద్య సేవల్లో ఎదురవుతున్న లోపాల్ని తక్షణమే తొలగించాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. తన రెండు పేజీల బహిరంగ లేఖలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ప్రజల మనసుల్లో నెలకొన్న ఆలోచనలు, ఆందోళలను వివరించి వాటిని పరిష్కారం చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అభిప్రాయలు, ఆందోళనలను వివరిస్తూ….రోగుల పట్ల వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సహా ఇతర వైద్య సిబ్బంది వైఖరి, సకాలంలో రోగుల్ని పరిశీలించడం, నిర్దేశిత పనివేళల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండడం, స్పెషలిస్టు మరియు సీనియర్ వైద్యులు నిర్దేశించిన విధంగా ఓపీ, ఐపీ సేవల్ని అందించడం, రోగ నిర్ధారణ పరికరాల పనితీరు, ప్రైవేట్ పరీక్షా కేంద్రాలకు రోగుల్ని పంపడం, పరిశుభ్రత వంటి విషయాల్లో లోపాలున్నాయని మంత్రి వివరించారు.
అయినా…ప్రభుత్వాసుపత్రుల్లో రోజు రోజుకీ పెరుగుతున్న ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు వాటి పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించినప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో సమస్యల్ని పలు మార్లు సమీక్షించి వాటి పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవస్థీకృతం చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ, క్రమానుగత సమీక్షలతో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత మెరుగు పడటం పట్ల మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి…ఖర్చుతో కూడిన వైద్యం, రోగ నిర్ధారణ కోసం అనవసరమైన పరీక్షలు చేయించడం, రోగులతో వైద్యులు అతి తక్కువ సమయాన్ని గడపడం, నర్సింగ్ , ఇతర సాంకేతిక సిబ్బందికి తక్కువ వేతనాల చెల్లింపు వంటి అంశాలు ప్రైవేట్ వైద్య రంగంలో నెలకొన్న వ్యాపార దృక్పధానికి అద్దం పడుతున్నాయని, ఈ అంశాలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.