NEWSANDHRA PRADESH

ప్రొద్దుటూరుతో చెర‌ప‌లేని అనుబంధం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

అనంతపురం జిల్లా – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను రాజ‌కీయ ప‌రంగా ఎదిగేందుకు ప్రొద్దుటూరు దోహ‌ద ప‌డింద‌న్నారు. ధర్మవరం శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా త‌న‌ సొంత ఊరైన ప్రొద్దుటూరులో అడుగపెట్టారు. నాలుగు నెలల తర్వాత పుట్టిన ఊరిలో అడుగు పెట్టడం కాస్త బాధగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలు త‌న‌పై చూపిన ప్రేమాభిమానాలకు చాలా సంతోషం కలిగిందన్నారు మంత్రి.

ప్రొద్దుటూరు ప్రజల ప్రేమను ఎన్నటికీ మరిచి పోలేనని అన్నారు. ఆడవారికి మెట్టినిల్లు ఎలాగో ధర్మవరం నాకు అలాంటిదన్నారు స‌త్య‌కుమార్ యాద‌వ్. ప్రొద్దుటూరుతో నా బంధం ప్రత్యేకమైనది. అటు ధర్మవరం, ఇటు ప్రొద్దుటూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్ర‌క‌టించారు. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్​ నుంచి నిర్వహించిన పౌర స్వాగత యాత్రలో పాల్గొనడం మ‌రిచి పోలేన‌ని అన్నారు.

ప్రొద్దుటూరు ప్రజల అభిమానం వెల కట్టలేనిది. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనని అన్నారు స‌త్య కుమార్ యాద‌వ్. ధర్మవరం, ప్రొద్దుటూరు నాకు రెండు కళ్లు. ఇక్కడి ప్రజలు నాకు కుటుంబ సభ్యులతో సమానం. వారికి ఏ కష్టం వచ్చినా అన్నలా.. కొడుకులా.. ఆప్తుడిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రొద్దుటూరులో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఎన్డీయే కూటమి విజయం సాధించడంలో కృషి చేసిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

పార్టీని నమ్ముకుని, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే సామాన్య కార్యకర్తనైన త‌న‌కు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం దక్కిందన్నారు. నాలాగే ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుందన్నారు. అది బీజేపీతోనే సాధ్య‌మ‌న్నారు.