స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్
అమరావతి – దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముంబైలో ఇద్దరు ఈ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. మరో వైపు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసుల గురించి స్పందించారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
బుధవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే తాము కరోనా విషయంలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. దీనిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ కిట్లు సిద్దంగా ఉంచామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెంద వద్దని సూచించారు.
అయితే ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేస్తున్నామని, మరోసారి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించామని తెలిపారు సత్య కుమార్ యాదవ్. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.