ప్రకటించిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : అనంతపురం జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేతల అభివృద్ధికి 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేయనున్నట్లు తెలిపారు. నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ లో భాగంగా సెర్ప్ ఆధ్వర్యంలో రూ.120 కోట్లతో నేతన్నలకు పని కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధిని కల్పించనున్నామన్నారు. ఎన్ఎచ్డీసీ పథకం ద్వారా 15 శాతం సబ్సిడీతో నూలు సరఫరా చేస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు.
అసెంబ్లీలో పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. త్రిఫ్ట్ పథకం కింద రూ.5 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ చేనేతలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నామని, ఇందుకోసం బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు. 2024-25లో రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. త్రిఫ్ట్, ముద్రా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో చేనేతలకు రూ.138 కోట్లు కేటాయించామన్నారు.
త్వరలోనే చేనేత సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించనున్నామని మంత్రి సవిత తెలిపారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన వీవర్ శాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో వీవర్ శాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా కర్నూలు, విజయనగరం ఎంపీలు తమ నియోజక వర్గాల్లో వీవర్ శాలల ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశారన్నారు.