మంత్రి సవిత పిలుపు
అమరావతి : రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలిసి పని చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి సీఎం రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురయ్యారన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులు సైతం అందలేదన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేశారన్నారు.
చివరికి జీతాలు, పెన్షన్లు సైతం సకాలంలో వచ్చిన సందర్బం లేదన్నారు మంత్రి సవిత. ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఉద్యోగులు అండగా నిలిచారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నారన్నారు.
ఆయనకు అండగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ ప్రతినిధులు బొప్పరాజు వెంకటేశ్వరరావు, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకటి వెంకట గురుమూర్తి, ఆర్య వైశ్య కార్పొరేషన్ డూండి రాకేశ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, కమిషనర్ రేఖారాణి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.